Online Puja Services

మన ధర్మం వివాహానికి అగ్నిని సాక్షిగా పరిగణిస్తుంది . ఎందుకు ?

3.21.104.109

అగ్ని గుణం దహించడం . కానీ మన ధర్మం వివాహానికి అగ్నిని సాక్షిగా పరిగణిస్తుంది . ఎందుకు ?
-లక్ష్మీ రమణ 

అగ్ని గుణం దహించడమే .  కానీ అగ్ని గుణం పోషణ కూడా ! ఇది ఇక్కడ సమానం గమనించాల్సిన విషయం . వేదాలన్నీ కూడా అగ్ని దేవునికి అగ్ర తాంబూలమే ఇచ్చాయి మరి.  భగవంతునికి ఏది సమర్పించినా అది ఖచ్చితంగా అగ్ని ముఖంగానే సమర్పించాలని మన ధర్మం చెబుతోంది . నిజానికి మనం ప్రతి రోజూ చేసే దీపారాధన కూడా అగ్ని ఆరాధనే కదా ! 

రాములవారు వానర రాజైన సుగ్రీవునితో అగ్ని సాక్షిగానే మైత్రీబంధాన్ని ఏర్పరుచుకుంటారు . రావణుడి చెరనుండి బయటపడ్డ  సీతమ్మ తల్లికి అగ్ని పరీక్షనే  కదా రాములవారు పెడతారు . అసలు అంతదాకా ఎందుకు ,  సనాతనధర్మాన్ని పాటించేవారందరూ అగ్నిసాక్షిగానే కదా వివాహం చేసుకుంటారు . 

పంచభూతాలలో  ఒకటయిన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షీ భూతం అని మన పురాణాలు చెబుతున్నాయి .  అగ్ని పవిత్రతకి, శక్తికి, పోషణకి  మారు పేరు. అందుకే ఆయన సాక్షిగా రాములవారు మైత్రి చేసుకున్నారు . అగ్నిపునీత అయిన సీతమ్మని చేపట్టి పట్టాభిరాములయ్యారు . అగ్ని దేవుడు దేవతల పురోహితుడు అని వేదాలలో చెప్పబడింది. ఈయన ఆగ్నేయానికి దిక్పాలకుడు.

అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం ఋగ్వేదంలో వివరించారు.

“సోమః ప్రధమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరః
తృతీయాగ్నిష్టే పతిః తురీయప్తే మనుష్యచౌః”

అని వివాహ సమయములో వరుడు స్త్రీతో అంటాడు. అంటే నీ బాధ్యతని  ప్రారంభ కాలంలో సోముడూ, తరువాత గంధర్వుడూ, ఆ తరువాత అగ్నీ వహించారు . ఇహ నాల్గవ వానిగా ఇప్పుడు నేను నీ బాధ్యతలను స్వీకరిస్తున్నాను అని అర్థం. 

అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసినది సోముడు (చంద్రుడు). చంద్రుడు చల్లనివాడు . చక్కనివాడు . అవే లక్షణాలు పసిపాయిలోనూ కనిపించడానికి కారణం చంద్రుని పాలనే .  నిండు చంద్రుణ్ణి ఎంత చూసినా తనివి తీరుతుందా ? అలానే పసిపాపను చూసినప్పుడు మనసుకి ఆ వెన్నెలలోని స్వచ్ఛతే అనుభవమవుతుంది . కొంత వయసు వచ్చాక ఆమె బాధ్యతని గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళ్ళిపోతాడు. 

ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా, గంధర్వుడు స్వీకరించాడన్నమాట . “లావణ్యవాన్ గంధర్వః” అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశ పెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమయిన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని, చందనాన్ని ఇచ్చేసి నా పనయిపోయింది ఇక నీదే పూచీ అని ఆ కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళిపోతాడు. 

ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా, అగ్ని స్వీకరించాడు. “అగ్నిర్వై కామ కారకః” అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని (కామాగ్ని) ప్రవేశ పెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది. ఇహ ఆమె వివాహానికి యోగ్యురాలని భావించిన అగ్ని, ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక కళ్యాణ సమయములో ఆమెను సాక్షాత్తూ నారాయణ స్వరూపుడైన ‘వరుడు’కి  ఇస్తాడు. అలా ‘పూర్ణ ప్రకృతి స్వరూపమైన’ ఆమెను “అగ్ని సాక్షిగా” వరుడు స్వీకరిస్తాడు. 

 ఇది వివాహం విషయంలో అగ్నిని సాక్షిగా పరిగణించడానికి కారణం . 

#agnisakshi #agni #sakshi #fire #marriage #vivaham

agnisakshi, agni, fire, sakshi, marriage, vivaham

 

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore